తిరుమలకు (Tirumala) నడక దారిలో వెళ్ళే భక్తుల కష్టాలు తీరడం లేదు. భక్తితో ఆ వెంకన్న స్వామిని దర్శించుకుందామని నడక మార్గంలో వెళ్ళే భక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళవలసి వస్తుంది. కరోనా లాక్ డౌన్ నుంచి తిరుమలలో వన్య మృగాల సంచారం ఎక్కువైంది. ఈ విషయంలో టీటీడీ చర్యలు తీసుకుంటున్నప్పటికి అవి నామమాత్రంగా ఉన్నాయని భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఇకపోతే తాజాగా అలిపిరి నడకదారిలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయానికి సమీపంలోని రిపీటర్ స్టేషన్ పరిసరాల్లో ఇటీవల చిరుతపులి (Leopard), ఎలుగుబంటి (Bear) కనిపించింది. ఆంజనేయ స్వామి, నరసింహ స్వామి దేవాలయం మధ్య కాలిబాట మార్గంలో ఉన్న ట్రాప్ కెమెరాల్లో వీటి సంచారం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ రెండు జంతువుల సంచారం ఈ నెల 24 నుంచి 27వ తేదీ మధ్య నమోదైందని టీటీడీ (TTD) శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
మరోవైపు ఈ మార్గంలో పలు చిరుతలను టీటీడీ.. ఫారెస్ట్ సిబ్బందితో కలిసి ఇప్పటికే బంధించింది. ఈ నేపధ్యంలో నడకదారిలో వెళ్ళే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా మాత్రమే వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు భక్తుల ప్రాణాలు రిస్క్ లో పెట్టె బదులు నడక మార్గంలో వెళ్లే వారి విషయంలో శాశ్వత చర్యలు చేపడితే బాగుంటుందని కొందరు భక్తులు భావిస్తున్నారు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే గాని టీటీడీ కళ్ళు తెరవదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.