గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో మాజీ సీఎం కేసీఆర్(EX CM KCR) ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం రిలీఫ్ ఫండ్ స్కీంను తీసుకొచ్చారు. ఆపదలో ఉన్నవారికి, మెడికల్ ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్(CMRF) కింద లబ్దిదారులకు వీటిని అందజేసేవారు. అయితే, గత ప్రభుత్వం హయాంలో మొత్తం 10వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరైతే అందులో కేవలం 5వేల చెక్స్ మాత్రమే డ్రా అయినట్లు అధికారులు గుర్తించారు.
మిగతా 5వేల చెక్కులు(5000 Cheques Missing) ఎక్కడికి పోయాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.మాజీమంత్రి హరీశ్ రావు క్యాంపు ఆఫీసులో పనిచేసే నవీన్ కుమార్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఏకంగా రూ.5లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాజేసిన ఉదంతం బయటకు రావడంతో ప్రభుత్వం తాజాగా సీఎంఆర్ఎఫ్‌లో జరిగిన అవకతవకలపై ఫోకస్ పెట్టింది.
గతంలో ఈ చెక్కుల కోసం లబ్దిదారుడు స్థానిక ఎమ్మెల్యేకు దరఖాస్తు చేసుకుంటే ఆయన లెటర్ హెడ్ ద్వారా ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ సాయం ప్రకటించేది. వాటిని ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలోని లబ్దిదారులకు అందజేసేవారు. అయితే, డ్రా కాకుండా మిగిలిపోయిన 5వేల చెక్కులు ఎమ్మెల్యేల వద్ద ఉండిపోయాయా?లేదా వాటిని ఎవరైనా గుట్టుగా డ్రా చేసుకున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
గతంలో మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలు, ఆఫీసు ఉద్యోగులు సీఎంఆర్ఎఫ్ చెక్కుల వివరాలను చూసుకునేవారు. లెక్కతేలని చెక్కులు లబ్దిదారులకు ఎందుకు చేరలేదు. బినామీల పేరిట మాయం చేశారా? లేక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉండిపోయాయా? అనేదానిపై ప్రస్తుతం విచారణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్‌గా దృష్టి సారించినట్లు సమాచారం.