ఏపీ అసెంబ్లీ(AP Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి, రాష్ట్రంలో అభివృద్ధిపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazir) ప్రసంగించారు. ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిందని, ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. అధికారంలోకి రాగానే రైతులు, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలకు ఆర్థిక చేయూత అందించినట్లు వెల్లడించారు.
జగనన్న గోరుముద్ద పథకం కింద రూ.4,416 కోట్లు, విద్యాకానుక కింద రూ.3367కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 8,9 తరగతుల విద్యార్థులకు 9.5 లక్షల ట్యాబ్‌లు అందించామన్నారు. జగనన్న వసతి దీవెన కింద ప్రతీ విద్యార్థికి 20వేలు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు. 53 ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం తీసుకొచ్చామన్నారు.
రూ.1,208 కోట్లతో 104, 108 వాహనాలు 1704 అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలోని 1.48 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నామన్నారు. 2019 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 36 లక్షల మందికి లబ్ది చేకూరిందని గవర్నర్ తెలిపారు. వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 అందిస్తున్నామన్నారు. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి పంట నష్టపోయిన రైతులకు అదే ఏడాది నష్టపరిహారం అందిస్తున్నట్లు తెలిపారు.
53.53 లక్షల మంది రైతులకు రూ.33, 300 కోట్లు రైతు భరోసా కింద అందించామని తెలిపారు. 22.85 లక్షల మందికి రూ.1,977 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందించామన్నారు. ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని చెప్పుకొచ్చారు. మత్స్యకారుల కోసం వేట నిషేధ కాలంలో ఇచ్చే పరిహారం 10వేలకు పెంచామని, 2.4 లక్షల మందికి రూ.540 కోట్లు జమ చేశామని తెలిపారు. వారికి ఎక్స్‌గ్రేషియాను రూ.10లక్షలకు పెంచామని తెలిపారు.
దిశ యాప్ కింద 3040 కేసులు నమోదయ్యాయని అని గవర్నర్ తమ ప్రసంగంలో పేర్కొన్నారు. 31.19 లక్షల ఇళ్ల స్థలాలు మహిళలకు పంపిణీ చేశామన్నారు. ఈ స్థలాల్లో 22 లక్షల ఇళ్లను నిర్మించామన్నారు. లే అవుట్లలో మౌలిక సదుపాయాలకు రూ.32,909 కోట్లు ఖర్చు చేశామని గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో జనవరి నుంచి పింఛన్లను రూ.3వేలకు పెంచి 66.34 లక్షల మందికి పింఛన్ల రూపంలో రూ.86,692 కోట్లు అందించామన్నారు.
పెన్నా నదిపై సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేశామని, పోలవరం ఇంకా 26శాతం పనులు మిగిలి ఉన్నాయన్నారు. గండికోట ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం రూ.925 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని, 19.41 లక్షల పంపుసెట్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.48,175కోట్లు అందించినట్లు తెలిపారు. ఇంధనరంగంలో రాష్ట్రానికి అనేక అవార్డులు వచ్చాయని నాలుగు కొత్త పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని గవర్నర్ తెలిపారు.