పేదల సొంతింటి కల కలగానే మిగులుతోంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ధర ఆకాశాన్నంటుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో ఇసుక ధరలు(Sand prices) సామాన్యులకు ఏమాత్రం అందుబాటు ధరల్లో లేవు. దీనిపై తాజాగా ఏపీ హైకోర్టు(AP High Court) ఆందోళన వ్యక్తం చేసింది. ఇసుక ధర బంగారంతో పోటీ పడుతోందంటూ వ్యాఖ్యానించింది.
ఇది వరకు లారీ ఇసుక(Sand) రూ.5వేలను కాస్త ఇప్పుడు రూ.20 నుంచి రూ.30వేలకు అమ్ముతుండడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా ఇసుక అధిక ధరల నుంచి సామాన్యులను ఎలా కాపాడుతారో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి మైనింగ్ అనుమతులు తీసుకున్న సంస్థలు అధిక ధరలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ సూటిగా ప్రశ్నించింది.
కేవలం ఐదెకరాల్లో అనుమతులు తీసుకున్న వారు ఏకంగా 50ఎకరాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరపడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక రీచ్‌ల్లో అధికారులకు ఏం జరుగుతుందో అధికారులకు తెలుసా? అంటూ ప్రశ్నించింది. మైనింగ్ అధికారులు పూర్తి నియంత్రణ కోల్పోయారని మందలించింది.
సామాన్య ప్రజలకు ఇసుక ధర అందుబాటులో ఉండేందుకు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. అసలు ఇసుక ధరను ఏవిధంగా నిర్ణయిస్తున్నారని, ధరను నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. దీనిపై అధికారులు వివరణ ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.