జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pavan Kalyan )కు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ పేరుతో సిఆర్పిసి సెక్షన్ 149 కింద ఈ నోటీసులు ఇచ్చారు. పెడనలో (Pedana) వారాహి యాత్ర (Varahi Yatra) సందర్భంగా దాడికి కుట్ర పన్నుతున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలంటూ పోలీసులు వీటిని జారీచేశారు. మచిలీపట్నంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా పెడనలో తనపై దాడికి 2వేలమంది రౌడీలను రంగంలో దించారని ఆరోపించారు.
పెడన సభలో రాళ్లతో దాడి చేస్తారని, ఇందుకోసం రౌడీషీటర్లను కూడా అధికార వైసీపీ ఇప్పటికే దించిందని పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పెడన సభలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎస్పీ, డీజీపీలు దీనిపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. దీనిపై స్పందించిన కృష్ణాజిల్లా పోలీసులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలంటూ నోటీసులు జారీ చేశారు.
దీనిపై కృష్ణాజిల్లా ఎస్పి జాషువా మాట్లాడుతూ… పెడన పోలీసు స్టేషను పరిధిలో తోటమూల సెంటరులో బహిరంగ సభకు అనుమతి కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేసారని తెలిపారు. తన సభలో దాడులు జరుగుతాయన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తాము పూర్తి విచారణ చేశామనీ, ఆ ప్రాంతాన్ని పరిశీలించామనీ ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలు ఉంటే తమ దృషికి తీసుకురావలని తెలియజేస్తు ఆయనకు నోటీసు ఇచ్చామని తెలిపారు. అలాంటి అసాంఘిక శక్తులు ఉంటే చర్యలు కచ్చితంగా తీసుకుంటామని తెలిపారు. పవన్ పై దాడి జరుగుతుందని ఆయనకు ఎలా తెలిసింది..? ఎటువంటి సమాచారంతో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసారో తెలిపాలని నోటీసుల్లో పేర్కొన్నామని తెలిపారు. కానీ తమ నోటీసుకు పవన్ నుంచీ రిప్లై రాలేదుని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ సభకు పూర్తిస్ధాయి బందోబస్ధు ఏర్పాటు చేసామని.. సరైన ఆధారాలు లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదని సూచించారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై తమకు ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. నాలుగు రోజులుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో జల్లెడ పడుతున్నామని కానీ అటువంటి అనుమానస్పద విషయాలేమీ తమ దృష్టికి రాలేదని తెలిపారు. రెచ్చగొట్టే భాష, సైగలు, లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించే అంశాలు వాడటం మానుకోవాలని సూచించారు. ప్రముఖ వ్యక్తులు, పోలీసు శాఖ, ఉన్నతాధికారుల మీద వ్యాఖ్యలు చేస్తే మేం రికార్డు చేసి పరిశీలిస్తామని తెలిపారు. మరికాసేపట్లో పెడనలో సభ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరుగుతాయోనన్న సర్వత్రా టెన్షన్ నెలకొంది.