తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్(Ap)లో ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే టీడీపీ(TDP), జనసేన(Janasena)లు ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై నిరసన సెగలకు పిలుపునిస్తున్నాయి.
తాజాగా, తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి సారథ్యంలో ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ అంటూ వినూత్న నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ఉమ్మడి పోరు ప్రారంభించారు. రోడ్ల అధ్వాన్న స్థితిని ఎండగడుతూ నిరసన వ్యక్తం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, జనసేన అభిమానులు ఈ నిరసనలో పాల్గొనాలంటూ పిలుపునిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి అతి దారుణంగా తయారైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని టీడీపీ, జనసేనలు తమ ప్రచార అస్త్రంగా మలుచుకున్నాయి. ఈ మేరకు 2023 నవంబర్ 18, 19 తేదీల్లో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలందరూ రోడ్ల మీద రావాలిని, ఎక్కడ గుంత కనిపిస్తే అక్కడ సెల్ఫీ దిగి ఆ ఫోటోలను, వీడియోలను #GunthalaRajyamAP, #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో షేర్ చేయాలని పిలుపునిస్తున్నారు.
‘ఏపీకి ఇతర రాష్ట్రాల వాళ్ళు పెట్టిన పేరు ‘గుంతల ఆంధ్రప్రదేశ్’. కానీ కళ్ళకు గంతలు కట్టుకున్న వైసీపీ పాలకులకు రోడ్లపై గుంతలు కనిపించడం లేదు. అందుకే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడిగా “గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది.” అంటూ నిరసన వ్యక్తం చేసేందుకు టీడీపీ, జనసేన అభిమానులు సిద్ధమయ్యారు.
మరోవైపు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘గుంతలకు దారేది’ పేరిట నిరసనకు పిలుపునిస్తున్నామని X వేదికగా చెప్పారు. ‘బాహుబలిలో కుంతల రాజ్యం చూశాం.. ఆంధ్రప్రదేశ్‌లో గుంతల రాజ్యాన్ని చూస్తున్నాం..’ అంటూ ధ్వజమెత్తారు. సైకో జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా గుంతల రాజ్యమైందని విమర్శించారు. అధ్వాన్న స్థితిలో ఉన్న రోడ్లపై ప్రయాణం నరకంగా మారిందని మండిపడ్డారు. సైకో సర్కార్ మొద్దు నిద్రను వదిలించండి అంటూ ట్వీట్ చేశారు.
బాహుబలిలో కుంతల రాజ్యం చూశాం. సైకో జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అంతా గుంతల రాజ్యమైంది. అధ్వానస్థితిలో ఉన్న రోడ్లపై ప్రయాణం నరకంగా మారింది. టిడిపి-జనసేన సంయుక్తంగా 18,19తేదీలలో మీమీ ప్రాంతాల్లో ఉన్న గుంతలు, అధ్వాన్నరోడ్ల ఫోటోలు, వీడియోలు తీసి #GunthalaRajyamAP,… pic.twitter.com/OH6PMrwYEm
— Lokesh Nara (@naralokesh) November 17, 2023