విశాఖ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ (MLC Vamshi Krishna) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సమక్షంలో వంశీ కృష్ణ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు (శనివారం) మీడియాతో వంశీ మాట్లాడుతూ.. ‘వైసీపీలో నన్ను రెచ్చగొట్టారు.. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా’ అన్నారు.
రాజకీయ క్షోభ ఎలా ఉంటుందో తనూ చూపిస్తానన్నారు వంశీకృష్ణ. పార్టీ మారేందుకు 10 మంది ఎమ్మెల్సీలు, 30 మంది కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు. నేను నా రాజకీయ భవిష్యత్తు కోసo పార్టీ మారాను. గతంలో వైసీపీ అభివృద్ధికి ఎలా పనిచేశానో ఇప్పుడు జనసేన అభివృద్ధికి అలాగే పని చేస్తా.. త్వరలోనే వైసీపీని కూడా క్లీన్ చేస్తా’’ అంటూ వంశీ కృష్ణ అన్నారు.
వైసీపీ పార్టీలో ఉన్నంతకాలం పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపారు. ఈ రాష్ట్రంలో బహుశా తానే ఒక్క రూపాయి తీసుకోకుండా పార్టీ కార్యాలయాన్ని నడిపించానన్నారు. తన మీద కామెంట్స్ చేసేవారు ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. రాజకీయాల్లోకి వచ్చి 60 ఎకరాలు అమ్ముకున్నాన్నానని, పార్టీ కోసం నయవంచన లేకుండా పనిచేశానని చెప్పారు.
వైసీపీ బీసీలను బాగా చూస్తే తామంతా ఎందుకు బయటకు వస్తామన్నారు. సోషల్ మీడియాలో తనపై చేస్తున్న దుష్ప్రచారాలపై వంశీకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి అమర్ పార్టీ మారినప్పుడు ఆత్మహత్య కాదా? తాను పార్టీ మారితే ఆత్మహత్య అవుతుందా? అని ప్రశ్నించారు. జగన్‌ను తిట్టిన వారే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. ఇప్పడు సీఎం జగన్ చుట్టూ దద్దమ్మలు చేరారని ఎద్దేవా చేశారు. తన రాజకీయ భవిష్యత్తు ఇలా కావడానికి ఎంవీవీ సత్యనారాయణ కీలకపాత్ర పోషించారని తెలిపారు.