ఏపీ (AP)లో జరుగబోయే ఎన్నికల కోసం వైసీపీ (YCP) సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే.. పార్టీ గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న నేతలు పలు వ్యూహాలను రచిస్తూ.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు.. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ (MLC) తోట త్రిమూర్తులు (Thota Trimurthulu)కి విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు షాకిచ్చింది. 27 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో సంచలన తీర్పు ప్రకటించింది.
ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం (Venkatayapalem)లో 1996 డిసెంబర్ 29న దళితుల శిరోముండనం ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు బరిలో ఉన్నారు.. ఈ క్రమంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంగా.. ఐదుగురు దళితుల్ని హింసించి, వీరిలో ఇద్దరికి శిరోముండనం చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. కేసు సైతం నమోదు అయ్యింది.
కాగా ఈ కేసు విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. చివరికి విశాఖ (Visakha) ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసుల ప్రత్యేక కోర్టు నేడు శిక్ష ఖరారు చేసింది. త్రిమూర్తికి 18 నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఈ కేసులో ఈయనతో పాటు మరో 9 మంది నిందితులుగా ఉన్నారు. మరోవైపు 1997 జనవరి 1న ఈ ఘటనపై అప్పటి జిల్లా ఎస్పీ కేసు నమోదు చేశారు.
కాగా ఈ కేసును కొట్టేస్తూ 1998లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. మళ్లీ 2000 సంవత్సరంలో కేసును ప్రభుత్వం రీ ఓపెన్ చేసింది. అయితే మొత్తం 24 మంది సాక్షుల్లో 11 మంది ఇప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తోట త్రిమూర్తులు వైసీపీ తరఫున మండపేట అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే రెండేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడటంతో ఎన్నికల్లో పోటీకి ఆయనకు ఎలాంటి ఇబ్బందులూ ఉండే అవకాశం లేదంటున్నారు..