ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal)కు వరుస సమన్లు జారీ చేస్తోంది. ఎన్నిసార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపినా ఆయన మొండికేస్తూ వచ్చారు.
ఈ క్రమంలో ఈడీపై సీరియస్ అయిన సీఎం కేజ్రీవాల్ ఈడీ సమన్లను సవాలు చేస్తూ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ప్రత్యేక న్యాయమూర్తి (పిసి యాక్ట్) రాకేష్ సియాల్ ఎదుట నేడు(మార్చి 14) విచారణకు రానుంది. కేజ్రీవాల్‌కు పదేపదే సమన్లు పంపినప్పటికీ, ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు హాజరుకావడంలో విఫలమయ్యారని వాదిస్తూ ఫెడరల్ ఏజెన్సీ మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేసింది.
గతంలో కోర్టు ఆదేశాల మేరకు మార్చి 16వ తేదీన రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది.
ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు ఎనిమిది సార్లు సమన్లు జారీ చేశారు. కానీ ఈ సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను పిలుస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయ్యారు.