మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం(Delhi CM), ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) అరెస్టయిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర పరిపాలనను ఎలా కొనసాగిస్తారని అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. ఆప్ నేతలు మాత్రం తమ సీఎం కేజ్రీవాలేనని, తీహార్ జైలు నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని చెబుతూ వచ్చారు.
అయితే ఇప్పుడు ఆప్ నేతలు చెప్పినట్లుగానే సీఎం కేజ్రీవాల్ ఇప్పుడు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆయన నిర్బంధ సమయంలోనే కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన తన మొదటి ఉత్తర్వును జారీ చేశారు. సీఎం కేజ్రీవాల్ ఒక నోట్ ద్వారా జల వనరుల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మంత్రి అతిషి(Minister Athishi) ఇవాళ(ఆదివారం) విలేకరుల సమావేశంలో సీఎం ఆదేశాలను వివరించనున్నారు.
అయితే, సీఎం పూర్తి స్థాయిలో పాలనను కొనసాగించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా భారత్‌లోనే సీఎం పదవిలో ఉండగానే అరెస్టయిన తొలి వ్యక్తిగా నిలిచిన కేజ్రీవాల్ జైలు నుంచి పాలన సాగించడం అంత సులభమేమీ కాదని న్యాయ నిపుణులు, జైలు అధికారులు చెబుతున్నారు.
తీహార్ జైలు నిబంధనల ప్రకారం జైలులో ఉన్న వ్యక్తిని కుటుంబసభ్యులు, ఇతరులు వారానికి రెండుసార్లు మాత్రమే కలిసే అవకాశముంటుందని తెలిపారు. అయితే, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రత్యేక అధికారాలతో ఏదైనా భవనాన్ని తాత్కాలికంగా జైలుగా మార్చి కేజ్రీవాల్‌ను తరలించి పాలనను అక్కడి నుంచి సాగించేలా మార్పులు చేయవచ్చని పేర్కొన్నారు. ఎల్జీ దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు.