ఉత్తరకాశీ టన్నెల్ (Uttarkashi tunnel) రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation)లో కీలక పాత్ర పోషించిన ఢిలీ జల్ బోర్డు (DJB)కార్మికులను సీఎం కేజ్రీవాల్ (CM Kejriwal) కలిశారు. వారితో కాసేపు ముచ్చటించారు. డీజేబీ సభ్యులు తమ ప్రాణాలను రిస్కులో పెట్టి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. పగలు,రాత్రి విరామం లేకుండా శ్రమించి 41 మంది కార్మికులను కాపాడరని చెప్పారు.
ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం స్వార్థపూరితంగా తయారైందన్నారు. అలాంటి స్వార్థ పూరిత ప్రపంచంలో ఎవరూ కూడా మరొకరి గురించి ఆలోచించరన్నారు. ‘నాకు ఏం జరుగుతుంది. ఒక వేళ నాకేమైనా జరిగితే నా కుటుంబం పరిస్థి ఏంటి’అని ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి మొదట ఆలోచిస్తారని తెలిపారు.
ఇలాంటి ప్రపంచంలో మీలాంటి వాళ్లు కూడా ఉండటం గొప్ప విషయమన్నారు. మీ ధైర్యసాహసాల గురించి ఇప్పుడు దేశమంత చర్చించుకుంటోందని అన్నారు. 41 మంది కార్మికులను రక్షించేందుకు మీరు పడిన కష్టం, మీ తెగువను ప్రపంచం మొత్తం చర్చించుకుంటోందని పేర్కొన్నారు.
రెస్క్యూ ఆపరేషన్ కోసం డీజేబీ సంస్థ ఎలాంటి డబ్బులు తీసుకోలేదన్నారు. ఆ కంపెనీ తన బాధ్యతను అర్థం చేసుకుందని, దేశ భక్తితో ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొందన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరిలో అలాంటి భావాలు తలెత్తితే, మన దేశం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని తాను నమ్ముతున్నానన్నారు.
టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే విషయంలో తీవ్రంగా శ్రమించారని సీఎంఓ వెల్లడించింది. అమెరికాకు చెందిన ఆగర్ మెషిన్ విఫలం అవగానే డీజేబీ సభ్యులను టన్నెల్ వద్దకు ఎయిర్ లిఫ్ట్ చేశామని తెలిపింది. సుమారు 36 గంటల పాటు డీజేబీ సభ్యులు తీవ్రంగా శ్రమించి కార్మికులను రక్షించారని చెప్పింది. ఈ సందర్బంగా రెస్క్యూ ఆపరేషన్ గురించి కార్మికులు సీఎంకు వివరించారని పేర్కొంది.