ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 21 నుంచి 25 వరకు పొడిగించిన ఢిల్లీ ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్ ప్రెస్ లైన్‌ను ప్రధాని మోడీ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఆహ్వానించలేదని ఆప్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీపై మంత్రి సౌరభ్ భరద్వాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
వారం క్రితం జీ-20 సదస్సులో నేతల ఎదుట వసుధైక కుటుంబం(ప్రపంచమంతా ఒక కుటుంబం) అని ప్రధాని మోడీ అన్నారని మంత్రి చెప్పారు. కానీ ఇప్పుడు ప్రధాని మోడీ తన సొంత దేశంలో మూడు సార్లు గెలిచిన ఓ ముఖ్యమంత్రిని మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించలేదని ఆయన అన్నారు.
మరో వైపు మంత్రి అతిషి కూడా ప్రధానిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ పార్టీలకు అతీతంగా ఆలోచించాలని సూచించారు. ప్రధాని అంటే ‘రాష్ట్రాలకు సంరక్షకుడు’అని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం నిధులు సమకూర్చే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేజ్రీవాల్‌ను ఆహ్వానించకపోవడం ప్రధాని మోడీ అల్పమైన ఆలోచనను తెలియజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2 కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్‌ను ప్రారంభించేందుకు స్వయంగా వెళ్లడం ప్రధాని హోదాకు కూడా సరిపోదని ఆమె అన్నారు. పొడిగించిన ఢిల్లీ ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్ ప్రెస్ లైన్ ను ప్రధాని మోడీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణికులతో ఆయన కాసేపు ముచ్చటించారు.