ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) అరెస్టు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) క్లారిటీ ఇచ్చింది. అవన్నీ వదంతులేనని (Rumours) ఈడీ వర్గాలు స్పష్టం చేసింది. ఈడీ గురువారం ఉదయం కేజ్రీవాల్ ఇంటిపై దాడులు చేయనుందని, అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంటారని మంత్రులు అతిశి, సౌరభ్ భరద్వాజ్‌తోపాటు ఆప్ నేతలు ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు ఈడీ వర్గాల నుంచి తమకు సమాచారం ఉందని బుధవారం రాత్రి వరుస ట్వీట్లు చేయడంతో ఈ చర్చ మొదలైంది. ‘అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో గురువారం ఉదయం ఈడీ దాడి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి’ అంటూ బుధవారం రాత్రి 11.50 గంటలకు మంత్రి అతిశి ట్వీట్ చేశారు. రెండు నిమిషాల తర్వాత మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇదే విషయాన్ని హిందీలో పోస్ట్ చేశారు.
ఈ మేరకు ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటిపై దాడులు చేయాలని గానీ, సోదాలు నిర్వహించాలన్న ప్లాన్ గానీ ఏమీ లేదని వెల్లడించారు. అయితే ఇదంతా వట్టిదేనని వెల్లడించారు. విచారణకు రాలేనంటూ కేజ్రీవాల్ రాసిన లేఖను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ మద్యం కేసులో ఈడీ మూడోసారి సమన్లు జారీచేసింది.
దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో బిజీగా ఉన్నానని, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున విచారణకు రాలేనని తెలిపారు. ఈడీ తాను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి గానీ, అవసరమైన పత్రాలు సమర్పించడానికి గాని తాను సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.