లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో ఈడీ దూకుడు పెంచింది. పలుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను విచారణకు హాజరు కావాలని కోరిన, ఆయన స్పందించ పోవడంతో, కేజ్రీవాల్‌పై న్యాయస్థానంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఇప్పటికే ఫిర్యాదు చేసింది. మరోవైపు ఈ కేసును సీరియస్ గా తీసుకొన్న ఈడీ.. కేజ్రీవాల్ సన్నిహితుల ఇళ్లపై దాడులు మొదలు పెట్టింది.
నేటి ఉదయం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్ సహా ఆప్‌తో సంబంధం ఉన్న పలువురి ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. సుమారు 10 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. సీఎం వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్, ఢిల్లీ జలబోర్డు మాజీ సభ్యుడు శలభ్‌కుమార్, ఆప్ రాజ్యసభ ఎంపీ, జాతీయ కోశాధికారి N.D.గుప్తా కార్యాలయంతో పాటు మరికొందరి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. .
మరోవైపు ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి.. ఈడీకి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించనున్నట్లు పేర్కొన్న మరుసటిరోజే ఈ సోదాలు జరగటంతో ప్రాధాన్యం సంతరించుకొంది. కాగా మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా బీజేపీ (BJP)కి చెందిన బెదిరింపు విభాగం-ED గురించి కీలక విషయాలను గుట్టురట్టు చేయనున్నట్లు తెలపడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అతిషి కీలక వ్యాఖ్యలు చేశారు.. గత రెండేళ్లుగా ఆప్ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే అనేక సార్లు సమన్లు జారీ చేసినా, కొందరిని అరెస్ట్ చేసినా, ఒక్క రూపాయి సైతం ఈడీ రికవరీ చేయలేదని పేర్కొన్నారు. ఆప్ నేతలను ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తప్పుడు సాక్ష్యాలు చెప్పాలంటూ, ఈడీ బెదిరిస్తోందని ఆరోపించారు. మరోవైపు ఈడీ, కేజ్రీవాల్‌కు ఐదుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే పలు కారణాలు పేర్కొంటూ, కేజ్రీవాల్ ప్రతిసారీ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ ఈ వ్యవహారంపై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్ట్ ను ఆశ్రయించింది.