స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు (Skill Development Case) లో అరెస్టై రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న చంద్రబాబు (Chandrababu) పై ఏంఐఏం పార్టీ అథ్యక్షుడు అససుద్దీన్ ఒవైసీ (Owaisi) స్పందించారు. చంద్రబాబు జైల్లో హ్యాపీగా ఉన్నారని కామెంట్ చేశారు. అసలు ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో మీకు అందరికి తెలుసు అని వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడిని ఎప్పటికీ నమ్మలేమని అససుద్దీన్ అన్నారు. ప్రజలు కూడా ఆయన్ని నమ్మవద్దని హైదరాబాద్ ఎంపీ అససుద్దీన్ ఒవైసీ కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రెండే పార్టీలు ఉన్నాయని, ఒకటి టీడీపీ అయితే రెండోది జగన్ పార్టీ వైసీపీ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మంచి పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు.
మజ్లిస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై కూడా అససుద్దీన్ మాట్లాడారు. తమ పార్టీ తరపున ఏపీలో కూడా బరిలోకి దిగేందుకు ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా మజ్లిస్ పార్టీ పని చేయాల్సిన అసవరం ఉందంటూ కార్యకర్తలతో అన్నారు. తెలుగు రాష్ట్రాల మజ్లిస్ కార్యకర్తలతో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అలాగే బీఆర్ఎస్ ఎమ్మేల్యేలపై కూడా ఒవైసీ ఫైర్ అయ్యారు. మజ్లిస్ పార్టీ కార్యకర్తలు, నేతలను వేధిస్తున్న ఎమ్మెల్యేలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటామంటూ బీఆర్ఎస్ ఎమ్మేల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. తమతో స్నేహపూర్వకంగా ఉంటే తామూ చేయందిస్తామని, కానీ ఫ్రెండ్‌షిప్ పేరుతో వెన్నుపోటు పొడిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని అససుద్దీన్ ఒవైసీ అన్నారు.