తెలంగాణ (Telangana)లో అధికారం కోసం ధన ప్రవాహం ఎంతలా జరిగిందో అందరికి తెలిసిందే. ఒకప్పుడు ఓటర్లకు డబ్బులు ఇవ్వాలంటే సంకోచించే వారు. కానీ ఇప్పుడు బహిరంగంగానే ఈ తంతు నడుస్తుందని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలు అంటే ఎన్ని కలలు అనే అర్థాన్ని వచ్చేలా ఉంది కాబట్టి కలలు నెరవేర్చుకోవడానికి, అధికారం సొంతం చేసుకోవడాని డబ్బుతో రాజకీయ నాయకులు (Politicians) ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
అందుకు ఉదాహరణగా.. రాష్ట్ర వ్యాప్తంగా 700 కోట్లకు పైగా పట్టుబడిందంటే ఏ రేంజ్లో డబ్బుల పంపిణీ జరిగిందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఇక చాలా చోట్ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బులు పంచినట్లు ఓటర్లు బహిరంగంగానే చెబుతున్నారు. మరోవైపు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు ఓటు కూడా వేయని సంఘటనలు ఉన్నాయి. అదీగాక డబ్బులిస్తేనే ఓటు వేస్తాం లేకపోతే ఓటు వెయ్యమని కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు ఆందోళనకు దిగినట్టు వార్తలు వచ్చాయి.
కాగా ఇలాంటి ఘటనే సూర్యాపేట (Suryapet)జిల్లా కేంద్రంలో కోటు చేసుకుంది. తమకు డబ్బులు రాలేదంటూ 20వ వార్డు జమ్మిగడ్డ ఓటర్లు (Jammigadda voters) నిరసనకు దిగారు. డబ్బులు పంపిణీ చేసిన నాయకుడి ఇంటి ముందు.. రావాలమ్మా రావాలి డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ మైకుతో నిరసనలు తెలిపారు.
నాయకులు డబ్బులు ఇస్తామంటూ తెల్లవారుజామున 3 గంటల వరకు ఎదురు చూసేలా చేసి చివరకి హ్యాండ్ ఇచ్చినట్టు తెలిపారు. అధికార పార్టీ ఇచ్చిన 40 లక్షలు పంపిణీ చేయకుండా.. కొందరు వాటిని పంచుకున్నారని ఆరోపించారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..