స్కిల్ స్కాంలో (Skill Scam) చంద్రబాబు (Chandra Babu) అరెస్టు కేవలం ప్రభుత్వ (Government) కక్షసాధింపు చర్యేకానీ మరొకటి కాదని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తమ అధినేత అరెస్టయినప్పటికీ టీడీపీ కార్యక్రమాలేవీ స్తంభించలేదన్న విషయం జగన్ గమనించాలని తెలిపారు. ఇప్పటి వరకూ జనసేనతో మాత్రమే తాము పొత్తులో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
వచ్చే ఎన్నికల వరకూ చంద్రబాబును జైల్లో ఉంచడమే జగన్ వ్యూహమన్నారు. అందుకే జగన్ హడావుడిగా ఢిల్లీకి బయలుదేరుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ బీజేపీకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేదానిపై తాను వ్యాఖ్యానించనన్నారు. కానీ బీజేపీ నేతలు కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల కమిటీని త్వరలోనే ప్రకటిస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ప్రస్తుతానికి టీడీపీ జనసేనతో మాత్రమే పొత్తులో ఉందనీ మిగతా లెఫ్ట్ పార్టీలతో పొత్తు పై చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. ఈ నెల 9 లోపు చంద్రబాబు విడుదలవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ చంద్రబాబు విడుదల ఆలస్యమైతే అక్టోబర్ 10 నుంచి వివిధ రూపాల్లో నిరసనలు చేస్తామని చెప్పారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై అప్రమత్తంగా ఉన్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
మరోవైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్కు సంబంధంలేదని రాష్ట్ర ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ మీద న్యాయస్థానంలో ప్రభుత్వ వాదలతో ఈ కేసులో డొల్లతనం బయట పడిందన్నారు. ప్రభుత్వం కేవలం కక్ష సాధింపుకోసమే అక్రమ కేసులు పెడుతున్న విషయం స్పష్టమైందని తెలిపారు.