కేంద్రంపై ఢిల్లీ సీఎం (Delhi Cm) కేజ్రీవాల్ (Kejriwal) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) అరెస్టును ప్రతి పక్షాలపై కేంద్రం జరిపిన ప్రతీకార చర్యగా ఆయన అభివర్ణించారు. దేశం సమిష్టిగా ప్రగతి దిశలో పని చేయాలని ఆయన సూచించారు. బీజేపీ చేస్తున్న ప్రతీకార చర్యలు ఈ దేశాన్ని ప్రగతి వైపు తీసుకు వెళ్లలేవని తెలిపారు.
చాలా నెలలుగా దర్యాప్తు సంస్థలు తమ పార్టీ సభ్యులను ప్రశ్నిస్తుున్నాయని పేర్కొన్నారు. ఆ దర్యాప్తులో ఇప్పటి వరకు ఏమైనా విషయాలు వెలుగులోకి వచ్చాయా అని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో నిన్న సుప్రీం కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో మీరంతా చూశారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పూర్తిగా తప్పుడు కేసు అని చెప్పారు. అందులో ఒక్క రూపాయి కూడా చేతులు మారలేదన్నారు.
ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు సమర్పించాలని సుప్రీం కోర్టు చెబుతోందన్నారు. కానీ దర్యాప్తు సంస్థలు అలాంటి సాక్ష్యాలను సమర్పించలేక పోతున్నాయన్నారు. తమపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవని ఖండించారు. విపక్షాలను దర్యాప్తు సంస్థలతో ఇబ్బందులకు గురి చేయాలన్నదే కేంద్రం ఉద్దేశమని ఆయన వ్యాఖ్యానించారు.
రాబోయే లోక్ సభ ఎన్నికలకు ముందు విపక్షాలను భయబ్రాంతులకు గురి చేసేందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. కేవలం రాజకీయ నాయకులను మాత్రమే కాకుండా వ్యాపార వేత్తలను కూడా భయాంధోళనలకు గురి చేస్తున్నారన్నారు. అలాంటి భయంకరమైన వాతావరణం దేశ పురోగతిని అడ్డుకుంటుందని చెప్పారు. అలాంటి చర్యలు దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.