పంజాబ్ రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 21 మంది(21 people death) కల్తీ మద్యం (Adulterated liquor)సేవించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం (Panjab Government)విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 21 మంది మృతిచెందారు. మద్యంలో ఇథనాల్ కలపడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో మొత్తం 40 మంది తొలుత ఆస్పత్రిలో చేరారు. వీరిలో నలుగురు మార్చి 20 బుధవారం మరణించగా, మరుసటిరోజు పాటియాలాలోని రాజింద్ర హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతిచెందారు.
ఈ క్రమంలోనే మార్చి 22 శుక్రవారం మరో ఎనిమిది మంది మరణించగా, శనివారం మర ఐదుగురు మరణించారని వైద్యులు వెల్లడించారు. ఈ కల్తీ మద్యం కేసులో 21 మంది చనిపోగా.. మిగిలినా వారు చికిత్స పొందుతున్నారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో శుక్రవారం నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. తప్పించుకున్న వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కల్తీ మద్యం అమ్ముతున్న ఇంటిపై పోలీసులు దాడులు జరిపి 200 లీటర్ల ఇథనాల్, ఒక విష రసాయానాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఘటనపై పంజాబ్ ప్రభుత్వం ప్రత్యేక విచారణ కోసం (సిట్)ను ఏర్పాటు చేసింది.