హైదరాబాద్ నడిబొడ్డున గల సెంట్రల్ యూనివర్శిటి(HYD Central University)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి ఓ చిన్న విషయం జరిగిన గొడవ కాస్త రెండు విద్యార్థి సంఘాల మధ్య తీవ్రమైన గొడవకు దారి తీసింది. దీంతో సెంట్రల్ యూనివర్శిటీలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఓ విషయంలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), అఖిల భారత విద్యార్థి పరి షత్ (ABVP) విద్యాసంఘాల నేతల మధ్య గొడవ తలెత్తింది. ఇది కాస్త మాటా మాట పెరిగి ఒకరిపై మరొకరు పరస్పర దాడులకు దిగే వరకు వెళ్లింది. ఇందులో కొందరు విద్యార్థులు బ్లేడులతో దాడులకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని తోటి విద్యార్థులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ దాడిలో మరికొంత మంది విద్యార్థులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే, సమాచారం అందుకున్న యూనివర్సిటీ పోలీసులు, సెక్యూరిటీ ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే, ఇరువర్గాల మధ్య గొడవ ఎందుకు జరిగింది. అందుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకుండా బ్లేడ్లతో విచక్షణా రాహితంగా దాడులకు పాల్పడిన విద్యార్థులను పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఎస్ఎఫ్ఐ, ఏబీవీఐ విద్యార్థి సంఘాలకు ఐడియాలజీ ప్రకారం భిన్నాభిప్రాయాలు ఉన్న విషయం తెలిసిందే.