తెలంగాణలో రాజ్యసభ (Rajya Sabha) సభ్యుల ఎన్నికల (Elections) లాంఛన ప్రాయంగా మారింది. రాష్ట్రంలో మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలకు ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగిసింది. ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. ఈ క్రమంలో వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
మొత్తం మూడు స్థానాలకు గాను కాంగ్రెస్కు రెండు స్థానాలు, బీఆర్ఎస్కు ఒక్క స్థానం దక్కనుంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర మాత్రమే చివరకి బరిలో నిలిచారు. దీంతో వారు రాజ్యసభకు ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధకారి ప్రకటించారు.
అంతకు ముందు శ్రమజీవి పార్టీ తరపున జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్లు నామినేషన్ వేశారు. కానీ నిబంధనల ప్రకారం రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ముగ్గురు అభ్యర్థులకు మద్దతుగా పది మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో వారి నామిషన్ తిరస్కరణకు గురయ్యాయి.
చివరకు ముగ్గురు నేతలు బరిలో మిగలడంతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి మేరకు ఇద్దరు కాంగ్రెస్, ఒక బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకోగా… రేణుకా చౌదరి రేపు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకోనున్నారు.