అయోధ్య(Ayodhya)లో రాంలల్లా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి సమయం ఆసన్నమవుతోంది. ఈ తరుణంలో భారత్(Bharath) లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చారిత్రాత్మక సందర్భాన్ని విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఒక వేడుకగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే, 50కి పైగా దేశాల్లోని ఆలయాల్లో రామ్ లల్లా విగ్రహావిష్కరణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 50 కంటే ఎక్కువ దేశాల్లో 500 కంటే ఎక్కువ ప్రదేశాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రపంచ విశ్వ హిందూ పరిషత్ విభాగం ఉన్నత అధికారులు వెల్లడించారు. విదేశాల్లో స్థిరపడిన హిందువులను ఆహ్వానించడానికి అయోధ్య నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పంపిన అక్షింతలను పంపిణీ చేస్తున్నారు.
జనవరి 22వ తేదీన అమెరికాలో 300, బ్రిటన్‌లో 25, కెనడా, ఆస్ట్రేలియాలో 30, మారిషస్‌లో 100, జర్మనీలో 10కి పైగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఐర్లాండ్ లాంటి దేశాల్లో మాత్రం ఒక్క ఈవెంట్ మాత్రమే నిర్వహిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా ఊరేగింపులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా రామ్ ఆధారిత సెమినార్లు, సమావేశాలు జరుగుతున్నాయి.
ఇక, విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్లో మనకంటే ఎక్కువ ఉత్సాహం ఉందని ప్రపంచ విభాగాధిపతి స్వామి జ్ఞానానంద్ చెప్పారు. జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించి.. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం 100 మంది భారతీయులకు మాత్రమే విదేశాంగ శాఖ ద్వారా ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం దొరికింది.