అయోధ్య (Ayodhya)లో శ్రీరాముడి విగ్రహానికి ( Ram Statue) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం త్వరలో జరగనుంది. ఆ అపూర్వ ఘట్టానికి సంబంధించిన ఏర్పాట్లు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. అయితే అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరాముడు ఎలా ఉంటాడు అనే దానిపై కోట్లాది మంది హిందువులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్య రాముడి విగ్రహాన్ని నల్లటి ఏకశిల (Black monolith)తో రూపొందించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ (Champat Roy) తెలిపారు.
విగ్రహం బరువు సుమారు ఒకటిన్నర టన్నులు ఉంటుందని, నల్లరాతితో 51 అంగుళాల పొడవైన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నట్లు ఆయన తెలిపారు. కర్ణాటక, రాజస్థాన్ కళాకారులు చెక్కిన మూడు విగ్రహాల్లో ఒకదానిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే చంపత్ రాయ్ వ్యాఖ్యలతో కర్ణాటక మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు అంతా భావిస్తున్నారు. అయితే, మిగిలిన రెండు విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాముడి విగ్రహం నల్లరాతితో ఐదేళ్ల బాలుడి రూపంలో ఉండనుంది. ఆయన కళ్లు, నవ్వు, శరీరాకృతి, ముఖం ఇలా ప్రతి అంశంలో దైవత్వం ఉట్టిపడేలా ఉండనుంది. విష్ణు అవతారంగా, ఓ రాజు కుమారుడిగా, బాలుడిగా, ఓ దేవుడిగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. నుదురు నుంచి కాలి వేళ్ల వరకు కలిపి విగ్రహ ఎత్తు 51 అంగుళాలు ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శితెలిపారు..
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ పూజలు జనవరి 16న ప్రారంభం కానున్నాయన్న ఆయన.. జనవరి 18న మధ్యాహ్నం గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత పవిత్ర జలాలు లేదా పాలతో విగ్రహాన్ని సంప్రోక్షణ చేయనున్నట్టు వివరించారు. ప్రతి ఏడాది రామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు రాముడిపై సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెప్పారు. ఇందుకోసం భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు పరిశోధించి ఈ ఎత్తును నిర్ణయించారని తెలిపారు.