కాంగ్రెస్ (Congress)పై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ (Balka Suman) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రజలకు అత్యాశ చూపి కాంగ్రెస్ అధికారం చేజిక్కించు కుందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చే అవసరం బీఆర్ఎస్కు లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను తాము సమర్థవంతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజా గొంతుకగా నిలుస్తామన్నారు.
చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో బాల్క సుమన్ పాల్గొని మాట్లాడుతూ….. సీఎం రేవంత్రెడ్డి తన పదవిని మరిచి… స్థాయి తగ్గించుకుని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సింగరేణి బొగ్గు బావులను అదానీకి అప్పజెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి, వివేక్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపణలు చేశారు.
డిసెంబర్ 9న చేస్తామన్న రుణమాఫీ, 4 వేల రూపాయల పెన్షన్, 5వందల రూపాయల గ్యాస్, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ సహా ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేలా బీఆర్ఎస్ తరఫున ఒత్తిడి తీసుకువస్తామన్నారు.
ఎన్నికల్లో ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. తాను చెన్నూరు విడిచి వెళ్లిపోనని దుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ ఈ నేలపై గులాబీ జెండా ఎగరే వరకు తన ఇల్లే అడ్డా… చెన్నూరే తన ఇలాకా అని బాల్క సుమన్ పేర్కొన్నారు.
చెన్నూరు నియోజకవర్గానికి నిధులు తీసుకురమ్మంటే, తన కొడుకు ఎంపీ సీటు కోసం వివేక్ ఢిల్లీ, హైదరాబాద్లో బిజీగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన అయితే వినోద్, వివేక్ ఎమ్మెల్యేలు ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఇప్పుడు తన కొడుకు వంశీకి ఎంపీ టిక్కెట్టు ఇప్పించాలని వివేక్ ఆశపడటం కుటుంబ పాలన కాదా..? అని ప్రశ్నించారు.