భారతీయ జనతా పార్టీ కి సైద్దాంతిక పునాది వేసిన గొప్ప వ్యక్తి బలరాజ్ మదోఖ్ (Bal Raj Madhok). దేశ రాజకీయాల్లో హిందుత్వ సైద్దాంతికతను ప్రాతిపదికంగా చేసుకుని అత్యంత బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ ఏర్పాటుకు విరామమెరుగకుండా శ్రమించిన అపర మేధావి. హిందువుల చిరకాల ఆకాంక్ష అయిన అయోధ్య (Ayodhya) రామ మందిర నిర్మాణం గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించిన మొదటి వ్యక్తి ఆయన.
బలరాజ్ మదోఖ్ 1920లో జమ్ములో జన్మించారు. జమ్ములో ఆర్ఎస్ఎస్ ను స్థాపించి దాని మూలాలు కశ్మీర్ అంతటా వ్యాపించేలా చేశారు. జమ్ములో అణచివేతకు గురవుతున్న హిందువుల వాణిని వినిపించేందుకు జమ్ము ప్రజాపరిషత్ ను ఆయన ప్రారంభించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్‌ను స్థాపించారు. ఆ తర్వాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి భారతీయ జన సంఘ్ ను ఏర్పాటు చేశారు.
జన సంఘ్ అధ్యక్షుడిగా పని చేస్తూ 1966-67లో పార్టీ 35 స్థానాల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. హిందువుల చిరకాల వాంఛ అయిన రామ మందిర నిర్మాణం గురించి పార్లమెంట్‌లో మొదటి సారిగా గళం వినిపించి అందరి ఆశలు రేకెత్తించారు. అయోధ్య రామాలయం, కాశీ, మధురల్లో హిందూ ఆలయాల పునర్నిర్మాణానికి సహకరించాలని కోరిన మొదటి వ్యక్తి ఆయనే.
భారత్ లో పుట్టినంత మాత్రాన భారతీయత రాదని, భారత్ పట్ల ఆ వ్యక్తి మానసిక భావనను బట్టి వస్తుందని భారతీయతకు ఆయన అసలైన అర్థం చెప్పారు. హిందూ రాజ్యం ఎప్పుడూ మత తత్వ రాజ్యం కాదని కుండ బద్దలు కొట్టారు. సెక్యులరిజం అనేది వేదాల్లో అంతర్లీనంగా ఉందని ప్రపంచానికి వివరించారు. దేవుడు ఒక్కడే అని, జ్ఞానం కలిగిన మనుషులంతా ఆయన్ని వివిధ పేర్లతో పిలుస్తున్నారంటూ సర్వమత సామరస్యానికి పిలుపు నిచ్చారు. రాజకీయాల నుండి మతాన్ని విడదీయడం గురించి తీవ్రంగా ఆలోచించే వారు మొదట భారతదేశాన్ని నిజమైన లౌకిక రాజ్యంగా మార్చడానికి చర్యలు తీసుకోవాలన్నారు.