హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అలయ్ బలయ్ ఫౌండర్ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న ఆమె.. బీజేపీకి సంబంధించిన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర వహిస్తున్నారు. పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆమె టీబీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ పాదయాత్రలోనూ సందడి చేశారు. పార్టీకోసం శ్రమించడానికి తానెప్పుడూ వెనుకాడనని విజయలక్ష్మి చాలా సందర్భాల్లో ప్రకటించారు.
రాబోయే ఎన్నికల్లో ఆమె సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ముషీరాబాద్ నియోజక వర్గం నుంచి కూడా ఆమె పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. 2018 లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లక్ష్మణ్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తనకు మరే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశమిచ్చినా అందుకు సిద్ధమేనని విజయలక్ష్మి వెల్లడించారు.
అలయ్ బలయ్ కార్యక్రమం బండారు దత్తాత్రేయకు మంచి గుర్తింపును తెచ్చింది. పార్టీలతో నిమిత్తం లేకుండా రాజకీయ ప్రముఖులనందరినీ ఒక చోటికి చేర్చి ఆత్మీయ సమ్మేళనాన్ని ఆయన ప్రతి దసరా పండుగ సందర్భంలో నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా విజయలక్ష్మి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ వస్తుండడం విశేషం.
గత ఏడాది అలయ్ బలయ్ సందర్భంగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఆమె ప్రకటించారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యత బీజేపీదేనన్నారు. వివాద రహితుడైన దత్తన్న అందరి అభిమానాన్నీ చూరగొన్నారు. ఇప్పుడు ఆయన కుమార్తె విజయలక్ష్మి పాలిటిక్స్ లో రాబోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.