– కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా?
– భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి రా..
– కేటీఆర్ కు బండి సవాల్
మంత్రి కేటీఆర్ (KTR) కామెంట్స్ పై స్పందించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay). కరీంనగర్ లో స్వాతంత్ర్య పోరాట యోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి.. ప్రధాని మోడీ (PM Modi) తెలంగాణ టూర్ పై కేటీఆర్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ (Telangana) లో అడుగుపెట్టే అర్హత మోడీకే ఉందన్నారు.
కృష్ణా జలాల వాటాపై కేసీఆరే మోసం చేశారని ఆరోపించారు సంజయ్. పాలమూరు-రంగారెడ్డికి డీపీఆర్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. ఓకే అయితే.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వస్తే చర్చిద్దామన్నారు. ఎన్నికలకు ఇదే రెఫరెండమని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్ల నిధులు వచ్చాయని తాము రుజువు చేస్తామన్నారు. అలాగే, తొమ్మిదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు ఇచ్చారు.. ఎన్ని నెరవేర్చారో చెప్తారా? అని అడిగారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్ ఫిట్ అంటూ కేటీఆర్ చేసిన విమర్శలపై స్పందించిన బండి.. కిషన్ రెడ్డి కాదు.. పాలనలో కేటీఆరే అన్ ఫిట్ అని ఎద్దేవ చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్ కు తెలంగాణలో తిరిగే అర్హత లేదన్నారు. ఇటీవల ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక్క మోటారు ప్రారంభించి ఎన్ని లక్షల ఎకరాలకు నీరిస్తున్నారని ప్రశ్నించారు.
ప్రధాని మోడీని విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదన్న బండి.. ప్రజలను మోసం చేసిన కేసీఆర్ కుటుంబానికే తెలంగాణలో తిరిగే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. ఈ తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ నేతలు కోట్లకు పడగలెత్తారని.. ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని విమర్శలు చేశారు.