– బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏ పార్టీ గెలిచినా..
– కొన్నాళ్లకే ఉప ఎన్నికలు ఖాయం
– సీఎం కుర్చీ కోసం గొడవలు పక్కా
– అందుకే, బీజేపీని గెలిపించాలి
– కచ్చితంగా బీసీని సీఎం చేస్తాం
– కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే
– హస్తం అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులిస్తున్నారు
– ధరణితో రైతులను గోస పెట్టారు
– చొప్పదండిలో బండి సంజయ్ ఆగ్రహం
రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. బీఆర్ఎస్ లో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని పోటీపడుతుండగా.. తర్వాత కవిత, హరీష్ రావు, సంతోష్ కుమార్ మధ్య కూడా పోటీ ఉందన్నారు. అలాగే, కాంగ్రెస్ లో కూడా ఎవరు ముఖ్యమంత్రి అనేది తేలలేదని.. తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయని తెలిపారు. అందుకే, బీజేపీని గెలిపించాలని కోరారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు బండి.
మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను పెట్టి.. డబ్బులు పంచినా కేవలం 10 వేల ఓట్ల ఆధిక్యంతోనే గెలిచిందని అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అసలు గెలిచే అవకాశం లేదని.. ఆ పార్టీ పోటీకే రాదని నాయకులు అన్న విషయాలను గుర్తు చేశారు. వారు అనుకున్నదానికి వ్యతిరేకంగా బీజేపీ గెలిచి చూపించిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ నిరంకుశ పాలనను చూసి రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని అన్నారు బండి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతూ బీజేపీని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చొప్పదండిలో బీజేపీ అభ్యర్థి భొడిగే శోభను గెలిపించకపోతే అందరూ ఒవైసీ తమ్ముళ్లవుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలిపించకపోతే కేసీఆర్ కు అల్లుళ్లు అవుతారని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి సీఎం కావడం తథ్యం అని స్పష్టం చేశారు. హైకమాండ్ ఇదే విషయాన్ని ప్రకటించిందన్నారు.
ధరణి తప్పుల తడకని కేసీఆరే చెప్పారని.. ఆయన అఫిడవిట్ లో చూపించిన భూమి.. రికార్డుల్లో గుంట భూమిని ఎక్కువగా చూపిందని అన్నారు సంజయ్. ధరణి పోర్టల్ రైతులను అరిగోస పెడుతోందని ఇప్పటికైనా అంగీకరిస్తావా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ప్రజల్లో ఇమేజ్ లేనే లేదన్నారు. బీఆర్ఎస్ ను ఓడగొట్టేది బీజేపీయే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బు సంచులు పంపుతున్నారని ఆరోపించారు బండి సంజయ్.