రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం నుంచి ప్రజాహిత యాత్రలో భాగంగా 5వ రోజు యాత్ర చేస్తున్నారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ (Bandi Sanjay).. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బీఆర్ఎస్ (BRS) నేతపై నిప్పులు చెరిగారు. నా గురించి స్వయం ప్రకటిత అపర మేధావి అవాకులు చవాకులు పేలుతున్నడు. నన్ను గెలకొద్దు.. గెలికితే అంతు చూస్తా అని హెచ్చరించారు.
శ్రీ సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బీజేపీ ప్రజాహిత పాదయాత్రను ప్రారంభించిన బండి.. టికెట్ కోసం కన్న కొడుకు పేరునే మార్చేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల అజయ్ రావు అని.. ఎన్టీఆర్ పేరు పెట్టుకొని టిక్కెట్ తెచ్చుకున్న మోసగాడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు సబ్ కాంట్రాక్ట్ సంస్థ నిర్వాకం వల్ల కూలిపోయే ప్రమాదానికి చేరుకొన్నాయని విజిలెన్స్ ఇచ్చిన నివేదికను గుర్తు చేసిన బండి.. ఆ సంస్థ ఎవరిదో, ఎవరు ఇప్పించారో నాకు తెలుసని వెల్లడించారు..
కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఆ సంస్థ పేరును, ఎవరి ద్వారా ఆ సంస్థకు సబ్ కాంట్రాక్ట్ దక్కిందనే వివరాలు బయటపెట్టాలిని డిమాండ్ చేశారు. అబద్దాలు, మోసాల్లో కేటీఆర్ అయ్యను మించిపోయిండని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్ కు అధికారం ఇవ్వడం న్యాయమా? అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదని ఆరోపించిన బండి సంజయ్.. ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ నేతలు తప్పించుకొనే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కేంద్రం తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందని తెలిపిన బండి సంజయ్.. సిరిసిల్ల జిల్లాకు రూ.1408 కోట్ల 6 లక్షల నిధులను ఖర్చు చేసిందని వెల్లడించారు. దీంతోపాటు సిరిసిల్ల అసెంబ్లీ, గంభీరావుపేట మండలానికి సంబంధించి ఏయే పనులకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందనే వివరాలను సైతం వెల్లడించారు. అయోధ్యలోనే రామ మందిరం ఎందుకు కట్టారని వితండ వాదం చేస్తున్న నేతలంతా చరిత్ర తెలుసుకోవాలని సూచించారు.
ఇంకా మాట్లాడితే ప్రజల కోరిక మేరకు దేశంలో అనేక ఆలయాలను నిర్మిస్తామని తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం హిందువుల 5 వందల సంవత్సరాల చిరకాల వాంఛ.. ఆ కలను నెరవేర్చిన నరేంద్ర మోడీ (Modi)ని మళ్లీ ప్రధానిని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.