తెలంగాణ బీజేపీ(Telangana BJP) సీనియర్ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) చేపట్టిన ప్రజాహిత యాత్ర హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. కర్రలు పట్టుకుని ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కాంగ్రెస్ నాయకులు ప్రజాహిత యాత్ర క్యాంపు వైపు రాకుండా పోలీసులు నిలువరించారు. కాంగ్రెస్ నేతలు కర్రలతో వస్తుంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ నుంచి గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొమ్మ శ్రీరాం చక్రవర్తిని ప్రజాహితయాత్ర క్యాంపునకు వెళ్లకుండా పోలీసులు నిలువరిచారు.
మరోవైపు, ప్రజాహిత యాత్రకు అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవాల్ విసిరారు బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశానో ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు. కరీంనగర్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే పొన్నం ప్రభాకర్ మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం చేతగాక ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ మూకలను పంపి విధ్వంసం సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ పొన్నం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాముడు అయోధ్యలోనే పుట్టారని చరిత్ర చెబుతున్నట్లు సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు బండి సంజయ్.
అయినా ఆధారాల్లేవని వితండ వాదం చేస్తున్న వాళ్లు వారి అమ్మకే పుట్టారనడానికి, తన అమ్మకే తాను పుట్టాననడానికి ఆధారాలేంటని ప్రశ్నించారు. అక్కడున్న నర్స్, డాక్టర్లు చెబితేనే కదా తెలిసేది.. నేనదే చెబుతున్నా అందులో తప్పేముందని బండి సంజయ్ అన్నారు. మీరు మా రాముడిని కించపరిస్తే మేం ఎందుకు భరించాలి? బరాబర్ మాట్లాడతా. రాముడి జన్మస్థలాన్ని, పుట్టుకను ప్రశ్నించే వాళ్లను చెప్పుతో కొట్టండని బండి సంజయ్ ప్రజలకు సూచించారు.