బంగ్లాదేశ్(Bangladesh) సార్వత్రిక ఎన్నికలు అంతా ఊహించినట్లే పాలక ప్రభుత్వం నెగ్గింది. ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా(Shaik Haseena) వరుసగా నాలుగోసారి ఆ దేశ పగ్గాలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది. పార్లమెంట్లో 300 స్థానాలకు గానూ 299 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.
అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్‌లో అవామీ లీగ్ 200 సీట్లలో గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రతినిధి వెల్లడించారు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా అవామీ లీగ్‌ను విజేతగా ప్రకటిస్తున్నామని, మిగిలిన నియోజకవర్గాల కౌంటింగ్ పూర్తయ్యాక తుది ఫలితాలు వెల్లడిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రతినిధి వివరించారు.
ప్రధాని షేక్ హసీనా తాను పోటీ చేసిన గోపాల్‌గంజ్-3 స్థానంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. హసీనాకు 2,49,965 ఓట్లు వచ్చాయి. ఆమె సమీప అభ్యర్థి బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన ఎం నిజాముద్దీన్ లష్కర్‌కు 469 ఓట్లు మాత్రమే వచ్చాయి. హసీనా.. 1986 నుంచి ఇప్పటివరకు వరుసగా ఎనిమిదోసారి ఆ స్థానం నుంచి విజయం సాధించారు.
ఈ ఎన్నికల నిర్వహణ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ నిరసనలు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతూనే ఉంటాయని బీఎన్పీ నేతలు అన్నారు. అయితే, విపక్షాల బహిష్కరణ పిలుపును ప్రజలు తిరస్కరించారని అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్ తెలిపారు. హింస, ఉగ్రవాదాన్ని ఎదురించి ఎన్నికల్లో పోరాడిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించాలనే డిమాండ్‌తో ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ సహా ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ 40 శాతమే నమోదైంది. 2018 సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతం మందికి పైగా ప్రజలు ఓటేశారు. తమ బాయ్‌కాట్ ఉద్యమం ఫలించిందని, అందుకే ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయిందని బీఎన్పీ నేతలు చెప్పుకొచ్చారు.