తెలంగాణ (Telangana) ఆడబిడ్డలకు అత్యంత ఇష్టమైన పండగల్లో బతుకమ్మది (Bathukamma) మొదటి స్థానం. ఆడబిడ్డలకు చీరలు పంచడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ సంబరాలకు మరింత జోష్ తీసుకురాబోతోంది. బుధవారం నుంచి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుందని మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు.
2017నుంచి తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఉచితంగా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నాలుగు విడతల్లో మొత్తంగా 5.81 కోట్ల చీరలను ప్రభుత్వం ఆడబిడ్డలకు అందించింది. ఈ ఏడాది 1.02కోట్ల చీరలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేస్తారు.
ఈ ఏడాది మొత్తం 10 రంగుల్లో 25 డిజైన్లతో బతుకమ్మ చీరలు సిద్ధం చేస్తున్నారు. 240 వెరైటీల్లో ఈ చీరలు ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. జరీ అంచుతో ఈ చీరలు సిరిసిల్ల నేతన్నలు తయారుచేశారు. ఇప్పటికే దాదాపు 30 లక్షలకు పైగా చీరలు పూర్తయినట్టు సమాచారం. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఈ చీరలను జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు.
గతంలో కంటే ఎక్కువ డిజైన్లు, రంగులు, వెరైటీల్లో చీరలను తయారుచేశామని జౌళీశాఖ అధికారులు తెలిపారు. జరీతో పాటు వివిధ రంగుల మేళవింపుతో దాదాపు 250 డిజైన్లలో చీరలను సిద్ధం చేశామన్నారు. తమ శాఖ వంద శాతం పాలిస్టర్ ఫిలమెంట్ నూలు చీరలను వివిధ ఆకర్షణీయమైన రంగులతో తయారు చేసిందని తెలిపారు. ఆరు మీటర్ల పొడవైన సాధారణ చీరలతో పాటు 9.00 మీటర్ల పొడవైన చీరలను కూడా తయారు చేశామన్నారు. వీటిని ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని వృద్ధ మహిళలకు అందిస్తామన్నారు. బతుకమ్మ వేడుకలు మొదలయ్యే నాటికి చీరల పంపిణీ పూర్తి చేసేలా అన్ని చర్యలూ తీసుకున్నామని తెలిపారు.