తెలంగాణా (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే తమ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు హామీలను (Six Promises) అమలు చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ హామీల గ్యారంటీ కార్డు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న భట్టీ ఈ కామెంట్లు చేశారు.
తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ప్రకటించిన సంక్షేమ పథకాల గ్యారెంటీ కార్డులను గడపగడపకు అందించే లక్ష్యంతో ప్రజల వద్దకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తుందని భట్టీ పేర్కొన్నారు.
ప్రజలు ఆకాంక్షించిన బంగారు తెలంగాణ నిర్మాణం కాంగ్రెస్ తో సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ హస్తం సామాన్యులకు అభయహస్తం అని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నప్పటికీ పేదలను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు.
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజలు చెప్పిన సమస్యలను దష్టిలో పెట్టుకుని హైకమాండ్ తో చర్చించి ఈ ఆరు హామీల గ్యారెంటీ కార్డును రూపొందించామన్నారు. గతంలో ఇచ్చి నెరవేర్చిన ఉచిత విద్యుత్ మాదిరిగానే వీటినీ వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు.
ఆరు గ్యారెంటీలు ఏంటంటే…
మహాలక్ష్మి ప్రతి మహిళకు ప్రతినెలా రూ.2500లు, రూ.500 కి గ్యాస్ సిలిండర్, రైతుభరోసా కింద ఏటా రైతులకు ఎకరాకు రూ.15000లు, రూ.12000లు వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నారు. గృహాజ్యోతి ప్రతి ఇంటికి 200యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి ఐదులక్షల అందించనున్నామన్నారు.
యువ వికాసం కింద ప్రతి విద్యార్దికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటెర్నేషల్ స్కూల్ ఏర్పాటు ద్వారా ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించనున్నామన్నారు. చేయూత పింఛన్ ప్రతి నెలా నాలుగు వేల రూపాయలు, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రతను కల్పించనున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.