ఒకవైపు దేశాల మధ్య యుద్ధాలు, మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా పలు వైరస్ (Virus) లు మానవ జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవి చాలదన్నట్టు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఊహించని నష్టాలు. అయితే తాజాగా యూరప్ (Europe) లోనే అతిపెద్ద నగరాలైన లండన్ (London), పారిస్ (Paris) నగర వాసులకు మరో పెద్ద సమస్య వచ్చింది. మునుపెన్నడూ లేనంత స్థాయిలో వ్యాప్తి చెందిన నల్లుల (Bed bugs) వల్ల జనం హడలెత్తిపోతున్నారు..
నల్లుల బాధ తట్టుకోలేక పారిస్, మార్సెల్లీలలో జనాలు పాత పరుపుల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. సినిమా థియేటర్లు, హోటల్స్, దవాఖానాలు, రైళ్లు.. ఇలా అన్నిచోట్లా నల్లులు విస్తరించాయి. దీంతో పారిస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మరోవైపు పెస్ట్ కంట్రోల్ కంపెనీ ‘రెంటోకిల్’ వెల్లడించిన వివరాల ప్రకారం..
బ్రిటన్ వ్యాప్తంగా నల్లులు కుట్టడం 65శాతం పెరిగిందని. క్రిమి సంహాక మందులను ఉపయోగించి వీటిని చంపేందుకు హోటల్స్ సిబ్బంది తంటాలు పడుతున్నట్టు తెలిపింది. కాగా ఈ నల్లుల వల్ల అంత ప్రమాదం లేకపోయినా, మానసిక సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటివి ఉంటాయి. దురద, అలర్జీ, చర్మ సంబంధ సమస్యలు కూడా రావొచ్చు. అదీగాక పరుపుల్లో దాక్కొని ఈ నల్లులు రాత్రిపూట మనిషి శరీరం నుండి రక్తాన్ని పీల్చుతాయి..