తేనెటీగలు(Bee Warriors) దేశ రక్షకులుగా సేవలందించనున్నాయి. భారత సైనికులతో సమానంగా పనిచేయనున్నాయి. తేనెటీగలు కాపాలా కాయడమేంటనుకుంటున్నారా? కానీ, ఇది నిజం. భారత్లోకి బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు సర్వసాధారణం. అనేక మంది బంగ్లాదేశస్థులను సైనికులు తరచూ అదుపులోకి తీసుకుంటారు.
ఎంతటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినా చొరబాట్లు ఆగడం లేదు. దీంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) వినూత్న ఆలోచన చేసింది. కేంద్ర ప్రభుత్వ చొరవతో సరిహద్దులో ముళ్ల తీగలపై తేనెటీగలను పెంచనున్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించారు. ఇది విజయవంతమైతే భారీ ఎత్తున తేనెటీగల పెంపకాన్ని చేపట్టనున్నారు. తేనెటీగలను ఏర్పాటు చేస్తున్న బీఎస్ఎఫ్ భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య 4.96 కి.మీ పొడవైన సరిహద్దు ఉంది. ఇక్కడ ముళ్ల తీగలు ఏర్పాటు చేశారు.
ఇప్పుడు సరిహద్దు భద్రతా దళ సిబ్బంది ఈ ముళ్ల తీగలపై తేనెటీగలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఛప్రా, బాన్పూర్, కడిపూర్, అంచాస్ సరిహద్దుల్లో కొన్నిచోట్ల తేనెటీగలను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణగంజ్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ 20 తేనే తీగల బాక్సులను ఏర్పాటు చేశారు. తేనెటీగల పెట్టెల నిర్వహణ బాధ్యతను స్థానిక ప్రజలు తీసుకుంటారు. తేనెను సేకరించే బాధ్యత కూడా వారే తీసుకుంటారు. దీనివల్ల ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందుతారని కేంద్రం భావిస్తోంది.
అదేవిధంగా తేనెటీగలు ఇష్టపడే కొన్ని పూల మొక్కలను కూడా పెంచుతున్నారు. తేనెటీగలకు ఇక్కడ వాతావరణం చాలా సహజంగా కనిపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. సరిహద్దులో ఏదైనా అనుచిత కార్యకలాపాలకు పాల్పడితే.. తేనెటీగల బాక్సులు కదిలి సంబంధిత వ్యక్తిపై దాడి చేస్తాయి. మరి తేనెటీగలు చొరబాటు ప్రయత్నాలను తగ్గిస్తాయో లేదో చూడాల్సి ఉంది.