సినిమాల్లో బెగ్గింగ్ మాఫియాకు సంబంధించిన సీన్లు చాలానే చూశాం. చిన్న పిల్లలను, వృద్ధులను గ్రూప్ గా చేర్చి ఎవడో ఒకడు లీడ్ చేస్తూ ఉంటాడు. వారిని బెదిరించి.. భిక్షాటన చేయించి డబ్బులు సంపాదిస్తుంటాడు. అచ్చం ఇదే మాదిరిగా హైదరాబాద్ (Hyderabad) లో ఓ సంఘటన వెలుగు చూసింది. అనిల్ పవార్ (Anil Pawar) అనే వ్యక్తం గ్రామాల్లోని ముసలి వాళ్లను నగరానికి తీసుకొచ్చి భిక్షాటన చేయిస్తున్నాడు.
కర్ణాటక (Karnataka) గుల్బర్గా ప్రాంతానికి చెందిన ఇతను నగరంలోని ఫతేనగర్ లో ఉంటున్నాడు. ఈజీ మనీకి అలవాటుపడి.. పిల్లలు, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలతో రోజువారీ కూలీ మాదిరి మాట్లాడుకుని.. నగరంలోని ప్రధాన కూడళ్లలో భిక్షాటన (Begging) చేయిస్తున్నాడు. ఆ డబ్బుల్లో వారికి కొంత మొత్తం ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని తన జల్సాలకు వాడుకోవడం మొదలుపెట్టాడు. ఇన్నాళ్లూ గుట్టుగా ఉన్న ఈ విషయం తాజాగా బయటపడింది.
టాస్క్ ఫోర్స్ పోలీసులు పవార్ ను అరెస్ట్ చేసారు. జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్, మాదాపూర్ ప్రాంతాల్లో వృద్ధుల చేత ఇతను భిక్షాటన చేయిస్తున్నట్టు తెలిపారు. అలాగే, అతని వద్ద పని చేస్తున్న 23 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మరికొన్ని విషయాలు బయటపడ్డాయి.
పవార్ రోజూ రూ.4,500 నుంచి రూ.6వేల వరకు తమ నుండి వసూలు చేస్తున్నాడని.. తమకు మాత్రం రూ.200 చెల్లిస్తున్నాడని వాపోయారు. పవార్ వద్ద నుంచి రెండు టూ వీలర్స్ ను సీజ్ చేశారు. భిక్షాటన చేస్తున్న వారిని ఎన్జీవో హోమ్ కు తరలించి, అతనిపై బెగ్గింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ తెలిపారు.