పండ్లు ఆరోగ్యానికి మేలు చేసేవే ఉంటాయి. ఆయా సీజన్ లలో లభించే పండ్లు రోగాల నుంచి రోగ కారకాల నుంచి మనల్ని కాపాడడానికి ఔషధంలా పనిచేస్తాయి. అలాంటి వాటిలో జామపండు ఒకటి. ఒక జామపండు 10 యాపిల్ పండ్లకు సమానం అందుకే దీనిని పేదవాడి యాపిల్ అంటారు. ఇది ప్రతి ఇంట్లో పెరిగే చెట్టు. పెరడే ఉండక్కర్లేదు అడుగు జాగాలో పెరిగి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంటుంది.
జామ లేదా జామి(Guava) మిర్టేసి కుటుంబానికి చెందింది. ఇందులో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. ఒకప్పుడు సీజన్ లో మాత్రమే జామపండ్లు లభించేవి. కానీ, ఇప్పుడు 365 రోజులు అందుబాటులో ఉంటున్నాయి. మానవ శరీరానికి ఎంతో మేలు చేసే ఈ జామ పండ్లను కచ్చితంగా తినాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇవి మానవ శరీరానికి ఎలాంటి మేలు చేస్తాయో చూద్దాం..
జామ పండులో ఉండే ఫైబర్ పొటీషియం బ్లడ్ ప్రెషర్ ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జామ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో దోహద పడతాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వివిధ చర్మసంబంధిత సమస్యల నుంచి కాపాడతాయి. అంతే కాదు, జామపండులోని ఔషధ గుణాలు అజీర్ణం, విరేచనాలు, కడుపునొప్పి లాంటి ఇబ్బందులు రాకుండా నివారిస్తాయి. దీనిలోని విటమిన్ C ఆరోగ్యకరమైన కంటి చూపునకు సహాయ పడుతుంది. పెద్ద సమస్య అయిన షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.
జామపండు మహిళలకు పీరియడ్స్ లో ఉపశమనం ఇవ్వడంలో దోహదపడుతుంది. పంటి నొప్పి, నోటి అల్సర్ లను తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. అంతే కాదు జామలో కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది దివ్యౌషధ ఫలం. అయితే.. ఇన్ని మేళ్లు చేసే ఉత్తమ ఫలమైన జామ రాత్రి పూట తింటే జలుబు చేస్తుంది. ఎక్కువగా తింటే షుగర్ లెవెల్ ను పెంచే సైడ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. కాబట్టి మితంగా తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.