బెంగళూరు (Bengaluru), రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం బాంబు పేలడం (Bomb Blast)తో 10 మంది గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పేలుడుకు సంబంధించిన విషయంలో పోలీసులు నిందితుడిని గుర్తించారు. బాంబు ఉన్న బ్యాగ్‌ను నిందితుడు కేఫ్‌లో వదిలివెళ్లినట్టు తెలిపారు. కాగా ఈ అంశంపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఐఈడీ కారణంగా ఈ పేలుడు సంభవించిందని మీడియాకు తెలిపారు.
మరోవైపు పేలుళ్ల కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వారిని విచారిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని బెంగళూరు నగర కమిషనర్ బీ దయానంద తెలిపారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపడుతున్నారని పేర్కొన్నారు. కేసు సున్నితత్వం, భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకొని మీడియా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎటువంటి ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని కోరారు. మరోవైపు, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడుకు కారణమైన నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఘటన వెనుక ఉన్న వారిని పట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం పేలుడు సంభవించిన రామేశ్వరం కేఫ్‌ను సందర్శించారు. పేలుడు ఘటనలో గాయపడి బ్రూక్‌ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. మరోవైపు మంగళూరులో 2022లో జరిగిన కుక్కర్ పేలుడుకు, రామేశ్వరం కేఫ్ పేలుడుకు మధ్య సంబంధం ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. రామేశ్వర్ పేలుడు ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నారని తెలిపారు.