భద్రగిరి దివ్యక్షేత్రం రఘువంశ తిలకుడు, దశరథ నందనుడు, శ్రీరామ మహాపట్టాభిషేకం వేడుకతో పులకించింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలతో భద్రాచల మాఢవీధులు సర్వాంగ సుందరంగా మారగా నిత్యపూర్ణాహుతి అనంతరం దేవదేవుడు పల్లకిలో మిథిలా మండపానికి చేరుకున్నారు. లోకాభిరాముడు వేద మంత్రోచ్ఛరణలు, జయ జయద్వానాలు మార్మోగుతుండగా సింహాసనాన్ని అధిష్టించారు ..
రాజాధిరాజుగా నీరజాక్షి సీతమ్మతో కలిసి స్వామివారు సాక్షాత్కరించారు. ఖడ్గం చేతపట్టి, కిరీటాన్ని ధరించి, ఛత్ర చామరాలతో కొలువుదీరిన రాములోరిని చూసి భక్తజనం పారవశ్యంలో మునిగిపోయింది. మరోవైపు గవర్నర్ రాధాకృష్ణన్ (Governor Radhakrishnan) ఈ క్రతువుకు హాజరైయ్యారు. ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు.
భక్తులు అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలకు విశేషంగా తరలివచ్చారు. దశరథ నందనుడిని తనివి తీరా దర్శించుకొని పులకించారు.. ఇక శ్రీరామ మహాపట్టాభిషేకం వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొన్నారు. మరోవైపు దర్గాలో దశరథ తనయుడి పట్టాభిషేకం మతసామరస్యానికి అద్భుత ఘట్టంగా నిలిచింది.
భద్రాద్రి (Bhadradri) కొత్తగూడెం (Kothagudem) జిల్లా సత్యనారాయణ పురం (Satyanarayana Puram)లోని హజరత్ నాగోల్ మీర్ దర్గాలో 12 ఏళ్లుగా శ్రీరామ నవమికి రఘువంశ తిలకుడి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అర్చకులు, దర్గా మాలిక్‌ల ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా ఈవేడుక కన్నులపండుగగా నిర్వహిస్తున్నారు..