వేసవి కాలం ప్రారంభం కావడంతో సూర్యుడు(SUN) తన ప్రతాపాన్నిచూపిస్తున్నాడు. మార్చి నెల చివరలో భానుడి తాపం(SUMMER HEAT) పెరిగినట్లు వాతావరణ శాఖ(Department of Meteorology) చెబుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వేడితీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉన్నట్లు నిర్దారణకు వచ్చింది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున తెలంగాణ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
ఏప్రిల్ మాసంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాతావరణ మార్పులు, చెట్ల సంఖ్య తగ్గిపోవడం,గ్లోబల్ వార్మింగ్ కారణంగా ముందు ముందు భూతాపం పెరిగి వేడి తీవ్రత విపరీతంగా పెరిగే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో మరో వారం రోజుల్లో గరిష్ట ఉష్టోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి 27 నుంచి 30 వరకు ఆదిలాబాద్, నిర్మల్, రామగుండం, జగిత్యాల,నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
పైన పేర్కొన్న జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఈనెల 28 నుంచి వేడిగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని రోజుల్లో 45 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉందని, అందుకే మధ్యాహ్నం పూట ఎవరూ బయటకు రాకూడదని వాతావరణశాఖ సూచించింది.