తెలంగాణ (Telangana) కాంగ్రెస్ (Congress)లో అంతర్గత కుమ్ములాట జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ పదవి కోసం నేతల మధ్య పోటీ నెలకొన్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఖమ్మం (Khammam) పార్లమెంట్ హాట్ సీటుగా మారిందని తెలుస్తోంది. అందులో కాంగ్రెస్ అధికారంలో ఉండటం వల్ల ఇక్కడి నుంచి గెలుపు సులువు అవుతుందని భావిస్తున్నారు..
మరోవైపు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కావడం వల్ల ఈ సీటుపై కన్నేసిన నేతలు ఆ దిశగా పైరవీలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఖమ్మం బరిలో నిలవడానికి క్యూ కడుతున్న నేతల్లో.. డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని.. మంత్రి పొంగులేటి సోదరుడు.. మంత్రి తుమ్మల కొడుకు.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఉన్నారు. వీరంతా ఖమ్మం టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ టికెట్ తనకు రాకుండా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు (Hanumanta Rao) షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయమని సృష్టం చేశారు. ఏఐసీసీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని పేర్కొన్నారు..
ఖమ్మం టికెట్ వీహెచ్ రాకుండా తాను అడ్డుకుంటున్నాననేది ఆయన అపోహా మాత్రమేనని వెల్లడించారు.. తాను ఎవరికీ టికెట్ రాకుండా అడ్డుకోలేదని ఈ సందర్భంగా భట్టి క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా అధిష్టానం ఖమ్మం టికెట్ సీనియర్ నేత వీహెచ్‌కు ఇస్తే అందరం కలిసి గెలిపించుకొంటామని అన్నారు. మరోవైపు ఖమ్మం ఎంపీగా తనకు ఈసారైనా ఛాన్స్ ఇస్తే గెలుస్తానని.. అయితే తనను ఎంపీగా పోటీ చేయకుండా తన పేరు లిస్ట్‌లో లేకుండా చేస్తున్నారని నిన్న వీహెచ్ సంచలన ఆరోపణలు చేశారు..