తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రాణత్యాగం చేసి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ.. బీఆర్‌ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె ఈ సమయంలో ఘాటుగా స్పందించడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుండగా.. శంకరమ్మ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.. ఇక త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ ఎంపీ సీట్ల కేటాయింపులో బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తన మనసులో మాట బయటపెట్టారు.. భువనగిరి (Bhuvanagiri) ఎంపీ (MP) క్యాండిడేట్ గా చాన్స్ ఇవ్వాలని అడిగినట్లు శంకరమ్మ తెలిపారు. తెలంగాణ ఉద్యమ వీరుని తల్లిగా తనకు టికెట్ ఇచ్చి కేసీఆర్ (KCR) గెలిపించాలని కోరారు. అయితే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని కూడా తెలిపారు. అంతే కాదు మిగతా పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించకుండా తనకు మద్దతుగా నిలవాలని కోరారు.
పదేళ్లుగా అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని పేర్కొన్న శంకరమ్మ (Shankaramma).. తెలంగాణ (Telangana) మలి దశ ఉద్యమంలో తన బిడ్డతో పాటు వెయ్యి మంది బిడ్డలు అమరులు అయ్యారని గుర్తు చేశారు. అమరవీరుల కుటుంబాలను అన్ని పార్టీలు గుర్తించాలని రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమర వీరుల కుటుంబాలకు పదేళ్లయినా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో పనిచేయని వారు మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు గా భోగభాగ్యాలు అనుభవిస్తున్నారని అన్నారు. పిల్లలను పొడగొట్టుకొన్న తాము.. ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నామో అర్థం చేసుకోవాలని తెలిపారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనుకున్న శంకరమ్మ చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇన్నాళ్ళూ ఈ విషయం పై ఎక్కువగా స్పందించని శంకరమ్మ.. ఇప్పుడు ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు బహిరంగంగా వెల్లడించడం ఆసక్తికరంగా మారిందని అంటున్నారు..