రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ (Police constables) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శుభవార్త (Goodnews).ఈనెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో శిక్షణ ప్రారంభించేలా అనువైన మైదనాలు, అభ్యుర్థుల అకామడేషన్ వంటి ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే సివిల్, ఏఆర్ (ఆర్మూడ్ రిజర్వ్), ఎస్‌పీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) విభాగాల అభ్యర్థులకు ట్రెయినింగ్ గత నెలలో ప్రారంభమైన విషయం తెలిసిందే.
అయితే, టీఎస్ఎస్పీ(TSSP) విభాగంలోని కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ త్వరలో ప్రారంభం కానుందని అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్, సీపీఎల్, టీఎస్ఎస్పీ విభాగాలకు సంబంధించి మొత్తం 13,444 మంది కానిస్టేబుళ్లను ప్రభుత్వం ఎంపిక చేయగా..రాష్ట్రంలో 11వేల మందికి సరిపడా మాత్రమే వసతులు ఉన్నాయి.
దీంతో టీఎస్ఎస్‌పీ విభాగానికి చెందిన 5,010 కానిస్టేబుళ్లకు ట్రెయినింగ్ తాత్కాలికంగా వాయిదా వేసి, మిగిలిన వారికి గత నెల 21న ట్రెయినింగ్‌ను అధికారులు ప్రారంభించారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాలను సిద్ధం చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ పోలీస్ నియామక మండలి(TSLPRB) నిర్వహించిన అర్హత పరీక్షల తుది ఫలితాలు అక్టోబర్‌లోనే వెలువడినా న్యాయపరమైన వ్యాజ్యాల కారణంగా తుది ఎంపిక ప్రక్రియ వాయిదాపడుతూ వచ్చింది. కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 14న ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందజేసిన విషయం తెలిసిందే.