లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Delhi CM Kejiriwal)కు భారీ షాక్ తగిలింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీ ముగియడంతో అధికారులు ఆయన్ను సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ మేరకు ఈడీ తరఫు న్యాయవాదులు మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే, ఇరువురి తరఫున వాదనలు విన్న న్యాయస్థానం కేజ్రీవాల్‌కు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్(14 Days Judiciary Remond) విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు మేరకు కేజ్రీవాల్‌ను అధికారులు తిహార్ జైలుకు తరలించనున్నారు. అయితే, తమ అధినేతకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆప్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరచగా మార్చి 28 వరకు ఈడీకి న్యాయస్థానం కస్టడీకి ఇచ్చింది.
మరోసారి దానిని ఏప్రిల్ 1 వరకు కస్టడీకి పొడగించింది. అయితే, తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. కాగా, కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయకుండా జైలులో నుంచి పరిపాలన చేయడంపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలాఉండగా, లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత కూడా తిహార్ జైలులోనే ఉన్నారు. గతంలో కేజ్రీవాల్, కవిత తిహార్ జైలుకు వస్తారని లిక్కర్ స్కాంలో అరెస్టై మండోలి జైలులో ఉంటున్న సుఖేశ్ చంద్రశేఖర్ పలుమార్లు లెటర్లను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.