ఢిల్లీ లిక్కర్ స్కాములో అరెస్టు అయ్యి ప్రస్తుతం తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(Mlc Kalwakuntla kavita) రౌస్ అవెన్యూ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. తనకు మధ్యంతర(Interim bail) ఇవ్వాలని కవిత ప్రయత్నించగా కోర్టు అందుకు నిరాకరించింది.
తన చిన్న కుమారుడి పరీక్షలో నేపథ్యంలో ఈనెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..దీనిపై కౌంటర్ ఇవ్వాలని న్యాయమూర్తి ఈడీ అధికారులను కోరారు.
స్పందించిన ఈడీ తరపు అధికారులు తొలుత కొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. అనంతరం కోర్టులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఈడీ తరఫు వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను బెదిరించడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.
ఎందుకంటే కవిత ఇప్పటికే తమకు సమర్పించిన 10 ఫోన్లలో డేటాను చెరిపేసి ఇచ్చిందని, మరికొన్ని ఆధారాలను ధ్వంసం చేసిందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇరు పక్షాల వాదనలు ఇప్పటికే పూర్తవ్వగా సోమవారం మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుచెప్పింది. ఈడీ వాదనలతో ఏకీభవించి కవిత బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది.