సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ “రైతు బిడ్డ” పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) బిగ్ బాస్ తెలుగు 7(Bigboss telugu 7) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్‌లోనే కాదు.. బిగ్‌బాస్ బయట కూడా రచ్చరచ్చ జరిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు పోట్లాడుకుంటే.. హౌస్ బయట వాళ్ల ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ హంగామా చేశారు.
ఈ ఘటనను జూబ్లీహిల్స్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దాడికి పాల్పడిన పల్లవి ప్రశాంత్, అమర్దీప్ ఫ్యాన్స్‌పై కేసులు నమోదు చేశారు. హౌస్‌లో ఉన్నప్పుడు అమర్దీప్, పల్లవి ప్రసాద్ మధ్య జరిగిన కొన్ని సంఘటనలే ఈ ఉద్రిక్తతలకు కారణంగా తెలుస్తోంది. టైటిల్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ రాత్రి 10 గంటల వరకూ కనిపిస్తే ఆ తర్వాత అర్ధరాత్రి వరకూ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు.
ఫైనల్ ఎపిసోడ్ తర్వాత, పల్లవి ప్రశాంత్ అభిమానులు స్టూడియో నుంచి బయటకు వస్తుండగా రన్నరప్ అయిన అమర్దీప్ కారుపై దాడి చేశారు. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 విజేతను ప్రకటించగానే పల్లవి ప్రశాంత్, అమర్దీప్ ఫ్యాన్స్ నడిరోడ్డుపై కొట్టుకున్నారు. దీంతో అన్నపూర్ణ స్టూడియో ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానులు పరస్పరం పిడిగుద్దులతో దుర్భాషలాడుతూ కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా అటువైపు వెళ్లే వాహనాలపైనా దాడికి దిగారు. బిగ్‌బాస్ ఫ్యాన్స్ దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీలకు పనిచెప్పారు.
మరోవైపు బస్సు అద్దాలు పగలగొట్టడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు.. ప్రజలను క్షేమంగా గమ్యానికి చేర్చే ఆర్టీసీపై దాడి అంటే సమాజంపై దాడి చేసినట్లేనని ఘాటుగా స్పందించారు. ఇలాంటి వాటిని ఒప్పుకోమని స్పష్టం చేశారు. బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని X(ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు.