– గవర్నర్ కు రాజకీయాలు ఆపాదిస్తారా?
– తప్పును ఎత్తిచూపితే సహించలేరా?
– మీరు చెప్పిందల్లా చేయాలా?
– రబ్బర్ స్టాంప్ లా ఉండాలా?
– బీఆర్ఎస్ పై బీజేపీ ఎటాక్
నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టుల విషయంలో బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గవర్నర్ తీరును తప్పుబడుతూ.. తమిళిసై (Tamilisai) బీజేపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని గులాబీ నేతలు అంటుంటే.. తప్పును ఎత్తిచూపితే రాజకీయాలు ఆపాదిస్తారా? ఇదెక్కడి పద్దతి అంటూ కమలనాథులు కౌంటర్ ఇస్తున్నారు. ఇరు పార్టీల నేతల డైలాగ్ వార్ పీక్స్ కు చేరుతోంది.
కొన్నాళ్ల క్రితం రాష్ట్ర కేబినెట్ నామినేటెడ్ ఎమ్మెల్సీ (MLC) పదవుల కోసం కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ ను ఎంపిక చేసి గవర్నర్ కు సిఫారసు చేసింది. అయితే.. ఈ పేర్లను తమిళిసై తిరస్కరించారు. ఆ అభ్యర్థులకు తగిన అర్హతలు లేవని స్పష్టం చేశారు. ఆర్టికల్ 171 (5) ప్రకారం అర్హతలు సరిపోవని తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తీరును తప్పు పడుతూ మంత్రులు, ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు మాటల దాడికి దిగడంతో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. గవర్నర్ కు రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు. గుడ్డిగా తమ ప్రతిపాదనలకు ముద్ర వేస్తే గవర్నర్ ను మెచ్చుకుంటారని.. తప్పును తప్పంటే రాజకీయాలు ఆపాదిస్తారా? అంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. రబ్బర్ స్టాంప్ లా గవర్నర్ ఉండాలని కారు పార్టీ లీడర్లు కోరుకుంటున్నారని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పందిస్తూ.. గవర్నర్ విషయంలో అనవసర రాద్దాంతం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తమిళిసై నిర్ణయం సరైనదేనని.. రాష్ట్రంలో అనేక మంది కవులు కళాకారులు, ఉద్యమకారులు ఉన్నారని, విళ్లెవరూ కేసీఆర్ కు కనపడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ అంటే గజ్వేల్, సిద్దిపేట సిరిసిల్ల, కామారెడ్డి నియోజకవర్గాలేనా అంటూ ఫైరయ్యారు ప్రభాకర్.