Telugu News » BJP : పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ ప్లాన్.. రాష్ట్రంలో అగ్రనేతల షెడ్యూల్డ్..!

BJP : పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ ప్లాన్.. రాష్ట్రంలో అగ్రనేతల షెడ్యూల్డ్..!

ఈ సభలు నిర్వహించడానికంటే ముందే.. రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టే ఆలోచనలో నేతలున్నట్లు తెలుస్తోంది.

by Venu
PM Modi: He won the party despite suffering.. Prime Minister showered praise on Nadda..!

తెలంగాణ (Telangana)లో బీజేపీ అగ్రనేతలు పర్యటించనున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా వరుస పర్యటనలతో హోరెత్తించనున్నారు. రాష్ట్రం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కనీసంగా పది ఎంపీ సీట్లు గెలుపొందాలన్న లక్ష్యంతో ఉన్న కాషాయం.. కాంగ్రెస్ (Congress), బీఆర్‌ఎస్‌ (BRS) లు ప్రచారాన్ని ప్రారంభించక ముందే తాము బరిలోకి దిగాలని భావిస్తోంది.

ఆ మేరకు పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ముందే ఈ నెలాఖరులోగా బీజేపీ (BJP) అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారపర్వంలోకి దూకాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేలోగానే ఆదిలాబాద్ (Adilabad), సంగారెడ్డి (Sangareddy)లో జరిగే సభల నుంచి మోడీ (Modi) ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ సభలు నిర్వహించడానికంటే ముందే.. రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టే ఆలోచనలో నేతలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత పదేళ్ల పాలనలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతితో పాటు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో కాంగ్రెస్‌ తీరును, రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ సర్కారు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలతో ఉన్నారని.. వీటిపై మోడీ సునిశిత విమర్శలు చేస్తారని రాష్ట్ర పార్టీ వర్గాల నుంచి సమాచారం..

ఈ నెల 29న ఢిల్లీలో జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాష్ట్రంలోని 17 సీట్లలో మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. అదేరోజు ఇద్దరు లేదా ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలు, ఐదారుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పార్టీ తీర్థం పుచ్చుకొనే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే పార్టీలో చేరుతున్న అభ్యర్థుల బలాబలాల ప్రాతిపదికన పేర్లను ఖరారు చేయనున్నట్టు సమాచారం.

మరోవైపు సరైన అభ్యర్థుల అన్వేషణలో భాగంగా… జహీరాబాద్, పెద్దపల్లి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం సీట్లకు క్యాండిడేట్ల ఎంపికను పెండింగ్‌లో పెట్టినట్టుగా పార్టీ నాయకులు చర్చించుకొంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోగా.. ఆదిలాబాద్, సంగారెడ్డి సభలకు మోడీ..అమిత్‌ షా, జేపీ నడ్డా పాల్గొననుండగా.. మార్చి 4న హైదరాబాద్‌లో అమిత్‌ షా సభ నిర్వహిస్తారని టాక్ వినిపిస్తోంది.

అయితే ముందుగా రాష్ట్ర పర్యటన ఖరారైతే అదే రోజున అమిత్‌ షా బదులు మోడీ సభ ఉండొచ్చునని సమాచారం. ఈ సభ కోసం గచ్చిబౌలి, సరూర్‌నగర్‌ స్టేడియాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విజయ సంకల్పయాత్రల ముగింపు సందర్బంగా హైదరాబాద్‌లో మార్చి 2న అమిత్‌షా సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని తొలుత భావించారు. ఐతే 2వ తేదీకి బదులు 4న రాష్ట్రానికి వచ్చేందుకు అమిత్‌షా సమయం కేటాయించడంతో ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment