తెలంగాణ (Telangana)లో మరోసారి అధికారం చేపట్టాలని ఆశపడుతున్న బీఆర్ఎస్ (BRS)కు.. కాంగ్రెస్ (Congress).. బీజేపీ (BJP)కంటి మీద కునుకు రాకుండా చేస్తున్నాయని అనుకుంటున్నారు. కాంగ్రెస్, కాళేశ్వరం అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళగా.. తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరో విషయంలో కేసీఆర్ కు బహిరంగ లేఖ ద్వారా మెలిక పెట్టారు..
గతంలో గులాబీ బాస్ ఇచ్చిన హామీలను ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు కిషన్ రెడ్డి.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో.. దళిత వర్గాలను మభ్యపెట్టేందుకు మీరు ప్రయోగించిన అస్త్రం దళితుడినే ముఖ్యమంత్రిని చేయడం అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.. రాష్ట్ర సాధన తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలో.. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ వేదికగా జరిగిన బహిరంగ సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి అని ప్రకటించారు..
అదీగాక కేసీఆర్ మాట చెబితే.. తల నరుక్కుంటాడు కానీ మాట తప్పడని ప్రగల్భాలు పలికిన మీరు.. అధికారంలోకి రాగానే ఎందుకు మాట మార్చారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం సాక్షిగా మాట ఇచ్చారు కదా.. మీ తల నరుక్కోవడానికి సిద్దామా అంటూ కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. ఇటువంటి మోసపూరిత ప్రతిజ్ఞలు చేసి.. దీన్ని గొప్ప రాజకీయ చతురతగా మీ వాళ్లతో ప్రచారం చేయించుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు.. తెలంగాణ దండోరా ఉద్యమాన్ని బలహీనం చేస్తూ.. దళితుల్లో లేనిపోని ఆశలు కల్పించిన మీ తీరు.. ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని తెలుసుకునేందుకు.. చాలా సమయం పట్టింది అని కిషన్ రెడ్డి బహిరంగ లేఖలో తెలిపారు.
నాకు ఏ పదవులూ వద్దు, నేను తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని పదే పదే వల్లెవేసిన మీరు.. అధికారంలోకి రాగానే మాది ఫక్తు రాజకీయ పార్టీ అని నిరూపించారు.. మీ బిడ్డ కవితమ్మే బతుకమ్మ అన్నట్లు ప్రజల నెత్తులమీద బలవంతంగా పెట్టారని కిషన్ రెడ్డి విమర్శించారు. మీ పుత్రరత్నంను తెలంగాణ ముఖ్యమంత్రిని చేయాలని ఆశపడ్డది నిజం కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.