పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో గెలవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ (BJP) ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 400కు పైగా సీట్లు సాధించాలనే టార్గెట్ ఫిక్స్ చేసుకొంది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి (Defense Minister) రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh) ఆధ్వర్యంలో బీజేపీ అధిష్టానం మేనిఫెస్టో కమిటీని నియమించింది. పలు ఆకర్షిత పథకాలతో ముందుకు రావాలని భావిస్తుంది.
మరోవైపు ప్రజల నుంచి ఎన్నికల మేనిఫెస్టో కోసం సుమారుగా 3 లక్షలకు పైగా సూచనలు అందాయని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య (Keshavprasad Maurya) వెల్లడించారు. అలాగే మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు తర్వాత మొదటి సారిగా నేడు సమావేశమైంది. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ సభ్యుడు కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. తమ మేనిఫెస్టో దేశ ప్రజల ఆకాంక్షలను తప్పక నెరవేరుస్తాయని పేర్కొన్నారు..
ప్రజల నుంచి తాము స్వీకరించిన సూచనలు, సలహాలపై ప్యానల్లో చర్చించి త్వరలోనే డాక్యుమెంట్‌ను ఖరారు చేస్తామని మౌర్య తెలిపారు. అదేవిధంగా నమో యాప్‌తో పాటు సలహాల కోసం ఏర్పాటు చేసిన నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చిన వారి నుంచి సూచనలు స్వీకరించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సీనియర్ బీజేపీ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం ఏర్పడిన ఈ కమిటీ మేనిఫెస్టోలో పలు పథకాలను పొందుపరచిందని తెలిపారు.
మొత్తం 27 మంది సభ్యుల గల మేనిఫెస్టో కమిటీలో పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి నలుగురు ముఖ్యమంత్రులతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారని మౌర్య అన్నారు.. అదేవిధంగా ఈ కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కన్వీనర్‌గా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కో-కన్వీనర్‌గా ఎంపికైనట్లు వెల్లడించారు. మరోవైపు సిక్కు, ముస్లిం, క్రిస్టియన్‌తో సహా మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరు మేనిఫెస్టో కమిటీలో ఉన్నట్లు పేర్కొన్నారు..